"ప్రీ డయాబెటిక్"!
"ప్రీ డయాబెటిక్" అనేది- గుమ్మం ముందు వచ్చి నుంచున్న మనిషిలాంటిది, ఏదో గుమ్మం బయటే ఉందని-మర్యాదకు లోపలకు పిలిచి “ఉండమ్మా బొట్టు పెడతా” అంటే ఏమవుతుంది.మన ఇంట్లోనూ-ఒంట్లోనూ తిష్ట వేసుకుని కూర్చోదూ; ఆపైన తీపి అయిన ప్రేమతో ఇంట్లో ఉన్నవాళ్ళ ఒంట్లోకి కూడా వెళ్ళదూ!
“ఒద్దమ్మా,నువ్వు లోపలి రాకు, కాస్త నోరు కట్టేసుకుని, ఒళ్లుదగ్గర పెట్టుకుని ఉంటా” అని చెప్తాం కదా.లేదూ “ఇప్పుడు తీరిక లేదు, వీలుచిక్కినప్పుడు నేనే కబురుపెడతా” అని కదా చెప్పాలి.
"ప్రీ డయాబెటిక్"వరద వచ్చేముందు చేసే ప్రమాద హెచ్చరిక లాంటిది! ఇక మనం తినే విషయంలోనూ,బ్రతికే విధానంలోనూ కావలసిన మార్పులు చేసుకోవాల్సిన సమయం వచ్చింది అని అర్ధం -కష్టం అనిపించినా సరే.ఇహ ఇప్పటివరకు మన ఇష్టం వచ్చినట్టు తిని బతికేసిఉంటాం- ఇప్పుడైనా దానికి ప్రీతికరమైన పనులు మానేసి,పదార్థాలు తినడం మానేసి - మన దరిచేరకుండా ఉండే రకంగా మారాలి.
అంతేగానీ ప్రీ డయాబిటిక్ ఏమైనా అనుకుంటుంది అని ఇంట్లోకి పిలిచి పీటవేసి భోజనంపెట్టి తాంబూలం ఇస్తే మీవంట్లోనే ఎల్లకాలం ఉండిపోతుంది-అప్పుడు దీన్ని ఫ్రీ డయాబిటిక్ అంటారు. కొంతమందికి మాత్రం పాపం శరీరం తీరో,వంశ పారంపర్యంగానో, ఇంకా ఇతర కారణాల వాళ్ళో గానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా వీటి బారిన పడతారు. ఒక్క తిండేకాదు, మన మారిన జీవిన విధానం, వత్తిడి, ప్రేమా ఆప్యాయతలు లేకుండా స్వార్ధంతో బతికేయడంవల్ల కూడా మెదడుమీద వీటి ప్రభావం ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇవన్నిటిని మానసిక రోగాల కింద జమకట్టవచ్చు- నా లెక్కప్రకారం-జనాభాలో ఎక్కువ శాతం మంది ఇలాగే బతుకుతున్నారు కూడా.
దీనికంటే శ్రేష్టం ఏమిటంటే అసలు డయాబిటికే రాకుండా ఒళ్ళు,మనసు జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది- దానితో బాటు మన చుట్టుపక్కలవాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకుంటే ఇంకా మంచిది-అప్పుడు మనం “డయాబిటిక్ ఫ్రీ” కదా!
మనకు ఆరోగ్యం మీద అంత శ్రద్ధా-ప్రాధాన్యత లేదేమోగానీ మన శరీరానికి కావాలి కదా-మనం అందులోనేగా-ఉన్నది, ఉండేది, ఉండబోయేది మరి! ఆరోగ్యం కావాలంటే ఆ మాత్రం ముందు జాగ్రత్త అవసరం కదా ఎవరికైనా!